అనగఅనగ ఒకరాజ్యంలో?


 అనగఅనగ ఒకరాజ్యంలో దైవాధీనం,రాజాధీనం అనే యిద్దరు భిక్షకులు ఉండేవారు.దైవాధీనం ప్రతి ఇంటిముందు నిలబడి"భిక్షాందేహి మాతా ,అంతా దైవాధీనం"   అంటూ భగవంతున్ని స్తుతిస్తూ,భిక్షాటన చేసేవాడు.కానీ రాజాధీనం మాత్రం ఆ రాజ్యంలోని రాజును పొగడుతూ,యింకా ఎవరైతే తనకు భిక్షం యిస్తారో వారందరిని పొగడుతూ,దైవాధీనం కన్నా ఎక్కువగా సంపాదించేవాడు.దైవాధీనం ఎందుకు ఎప్పుడు ఆ భగవంతున్ని పొగడుతూ,వుంటావు.దాని వల్ల నీకేమీ లాభం వుండదు .నాలాగా నువ్వుకూడా రాజుని,ప్రజలని పొగడుతూ తెలివిగా బతుకొచ్చుకదాఅని రాజాధీనం ,దైవాధీనంకు సలహాలు యిచ్చేవాడు.దైవాధీనం మాత్రం ఒక చిన్ననవ్వు నవ్వి,అంతా ఆ దేవుని దయ ఎలా వుంటే అలావుంటుంది.అని చప్పేవాడు.

        కొన్నిరోజులకు సంక్రాంతి పండుగ పర్వదినంనాడు, తనని రోజూ పొగడే రాజాధీనాన్ని ధనవంతున్ని చేయదలచి,రాజుగారు ఒక గుమ్మడికాయలో రంధ్రంచేసి అందులో రత్నాలు,మాణిక్యాలు పోయించి,పైనొక రూపాయనుంచి ,రాజాధీనానికి దానంచేస్తాడు.గుమ్మడికాయ దానంతో అసంతృప్తి చెందిన రాజాధీనం ఆగుమ్మడికాయను ఒక పిసినారి వర్తకునికి ఒకేఒక్క రూపాయకే అమ్మి  లాభం అనుకుంటూ సంతోషంగా ఇంటికి వెళతాడు.కాసేపటికి ఆ వర్తకుని ఇంటికి దైవాధీనం భిక్షకు వస్తాడు.స్వతాహా పిసినారి అయిన వర్తకుడు, పండుగరోజు ఎదైనా దానం చేయాలికాబట్టి డబ్బులీయగా యింతకు ముందు తానుకొన్న గుమ్మడికాయనే దానం చేస్తాడు.దైవాధీనం ఆ గుమ్మడికాయను తీసుకెల్లి వంటకు ఉపయోగించడంకోసం దానిని రెండుభాగాలుగా కోస్తాడు.అప్పుడు అందులోనుంచి రత్నాలు,మాణిక్యాలు కిందకు పడతాయి.ఇవి తనకు దేవుడిచ్చిన ప్రసాదంగా భావించి,సంతోషంగా ధనాన్ని స్వీకరిస్తాడు.

            యిక రాజాధీనం ఎప్పటిలాగా వీధుల్లో భిక్షమెత్తుకోవడం చూసి రాజు అతన్ని ప్రశ్నిస్తాడు.అతను ‌మొదట ఆ గుమ్మడికాయని తను వండుకుతిన్నానని అబద్దం చెప్తాడు.రాజుగారు గట్టిగాగద్దించి అడుగగా దాన్ని ఒక వర్తకునికి అమ్మినట్లు నిజం చెప్తాడు.వర్తకున్ని విచారించగా తాను దైవాధీనానికి దానం చేసినట్లు చెప్తాడు.దైవాధీనం నాకీ ధనం ఆ ఈశ్వరుని ప్రసాదంగా స్వీకరించానని. చెప్తాడు.అసలు రహస్యాన్ని గ్రహించిన రాజు ఎవరికి ఏది దక్కాలో అది దక్కుతుందని తలచి వెల్లిపోతాడు.దైవాధీనం తనకు దక్కిన సొమ్ములో సగం రాజాధీనానికి యిచ్చి యిలా అంటాడుభగవంతుడు సర్వాంతర్యామి అతన్ని నమ్ముకున్నవాల్లకు తప్పక రక్షిస్తాడు.ఎవరికి ఏ సమయంలో ఏమి యివ్వాలో అది యిస్తూ ఆదుకుంటాడు.అని చెప్పి వెళతాడు.